Sep 20, 2010

దైవమా..నీ దిక్సూచి ఎటు ?

కోట్లమంది కళ్ళకు కనపడుతున్నా..
మనిషి కి మనిషి కి  మనసు కి మాత్రమె కనిపించే అడ్డుగోడలు..
దేవుడి పూజ లో సైతం "నా" కే పట్టం కడుతూ
 దేవుడికి అర్థం కాని స్వార్థాన్ని రుచి చూపించే ప్రయత్నాలు ..

మన లో మనం అన్న భావన చనిపోయి శతాబ్దాలయ్యాయి అని 
వేదం లాంటి చిత్ర సమీక్షల్లో వర్దంతి సందేశాలు..


మాటకు ఒకలా మనసుకు మరోలా మనుగడ సాగిస్తున్న మన జనం
సాయం కావలిసి వచ్చేసరికి మానవత్వం మెదడు లో గంట కొడుతుంది మానవ జాతి ఎలా ఉండాలి అని ప్రసంగాలు పర పర పేపర్ల మీదకి పరిగెడతాయి ..
పని పూర్తి అయిందా..అంతే..పీచే ముడ్..
మళ్ళీ మన ఇరుకు గోడల్లోకి..బందుత్వ బందీఖనాల్లో కి..


ఎక్కడిది స్వార్థం...
హీరో ఎలా ఉండాలో కరెక్ట్ గా ఊహిన్చగలిగె మనం..
ఆ హీరో లోని మానవత్వం అన్న లక్షణాన్ని ..అందరం మనుషులమే..అన్న ఇంగితాన్ని ఇంజేక్షన్లతో ఇచ్చిన విసర్జిన్చేస్తాం ..

అనంత విశ్వం లో భూమి అణువంత ..
.ఆ సువిశాల అణువు మీది మానవ సామ్రాజ్యం కణం అంత..
ఆ కణానికి సోకిన ఈ స్వార్థం అనే కాన్సెర్ 
మొదటికే ముప్పు తేకముందే..కనువిప్పు కలిగితే..
సృష్టి ని గెలిచేది మనిషి..మరిచాడా..మట్టిలో కలిసెదీ మనిషే..


దైవమా..నీ దిక్సూచి ఎటు ?

Aug 29, 2010

జయహో తెలుగు తల్లి !!

వెన్నెల జిలుగులు , చిన్నారి నవ్వులు ,
తేనె ధారల జలపాతాలు
అన్నీ కలిపితే తేట తెనుగు పదాలు ..


అఖండ భారతావని లో ..అనేక భాషల నడుమ ..సంస్కృతుల నడుమ ..
నన్నయ్య తొలి అక్షరమై ..తిక్కన చెక్కిన చక్కని సాహితి శిల్పమై ..ఎర్రన ఎలుగేతిచాటిన పద్యమై ..
శ్రీనాథుని నోట శృంగార రసమై .పోతన పోతపోసిన భాగవతమై ఇంతింతై వటుడింతై అన్న చందాన
ఛందస్సు చీర తో అలంకరాది ఆడంబరాలతో అలంకరించబడినదిఐ ..అన్య భాషా సామ్రాట్టులు సైతం .
జయహో అని ప్రశంసించిన ప్రశస్తమైన పంచదార ధార.. తెలుగు..


ప్రభందాలను పాపిట దాచుకుని కావ్య రాశులతో దివ్య అలంకృతమై, కమనీయ కథనాల ..వీనుల విందైన కవనాల ఆభరణాలతో ..యతిప్రాసాది ఆహర్యముతో ..శతాబ్దాల తరబడి చక్కర వానను చిలకరిస్తున్న యశస్వి ..నిత్య జవ్వని తెలుగు..


మన భాష మనకు ముద్దు ..అన్న హద్దు ని దాటి అఖండ  దక్షినావని ని ఏలిన ..ఆంధ్ర భోజుని .ఆముక్తమాల్యద కి వామహస్తాన వయ్యారి చిలకై.. అతని రచనల మకుటాన నీలి వజ్రమై వెలుగొందింది.

రాయల గళసీమన రవ్వల పతకమై..భువన విజయ సభన అష్టదిగ్గజాల అభిసారికయై ..
అల్లసాని వారి జిగిబిగి ని నింపుకుని ...ధూర్జటి వారి ధీరో ధాత్త ధవళ కాంతులు ప్రసరింపచేస్తూ ..తెనాలి రామలింగడి తికమకను చతురతను చిందిస్తూ ..స్వర్ణయుగాన్ని లిఖించింది ..కదళీఫలపాక  సమాన కావ్య కన్య ..ఆమెపేరు తెలుగు..


కాల గమనాన గ్రాంధిక అంతః పురాన్ని విడిచి  వ్యావహారిక వస్త్రధారణ తో జనాల  నడుమకు చిటికెన వేలు ను పట్టుకుని తెలుగుని నడిపించిన సాహసి ..
తెలుగు అమ్మ అయితే ..మనం మామా  అని పిలుచుకోదగిన..మాతృభాషాదాహార్తి  గిడుగు రామమూర్తి ..

గ్రంధాలయాల చీకటిన మ్రగ్గిన ఆంధ్రభాషను అందరి నాలుకల మీద నాట్యం చేయించిన భగీరథ సమాన గిడుగు వారి జన్మ దినమే నేటి మన తెలుగు భాషా దినోత్సవం ..



తెలుగు వెలుగులు మరింత ప్రజ్వలితం అవుకాక..
గిడుగు వారి ఆశ కాలచక్ర అడుగడుగునా  ప్రతిఫలించు గాక

Aug 27, 2010

రేపనేది రాయల కాలం కాకపోతుందా...

వెన్నెల అంతా వెక్కి వెక్కి ఏడుస్తుంది..
తన గురించి తపించే కవులు కలువలు కనిపించటం లేదని..
వేదన వికటాట్టహాసం చేస్తుంది..
తను కొలువు కాని కన్నులు లేవని..తను ఆక్రమించని హృదయ సామ్రాజ్యాలు లేవని..



ఒకప్పుడు పచ్చని చేలవెంట నా సిరా ప్రవహించేది
ప్రకృతి చీర అంచు మీద నా మనసు ముగ్గయ్యేది
 కలం నా చేయి ని పట్టుకుని కలల  తీరాలకు తీసుకెళ్ళేది
ఆవేశం పలకరించినపుడు శ్రీ శ్రీ వారి ఇంటివైపు పరిగేట్టేది ..


 కనుపాప కమిలిన నరాల ఒత్తిడి లో
 నన్ను నేను పూర్తిగా తాకట్టు పెట్టుకుని
 నెలాఖరుకి ఊగె నాలుగు పచ్చ కాగితాలకు
మారు మాట్లాడకుండా తెల్లోడికి  తలప్పిగించేస్తున్నా..


 రేపనేది రాయల కాలం కాకపోతుందా అని ఆశ
ఆశ కైనా అంతు ఉండాలి రా అని అంతరాత్మ ప్రభోధ


ఎర్రబడ్డ మెదడు లోంచి 
ఏవో సన్నని మూలుగు లు ..
పదకొండో అవతారం కోసం పడిగాపులు..


కథ ...నిజం ..కావాలంటే చదవండి

అప్పుడెప్పుడో ..అంటే ఓ ఆరు గంటల క్రితం ..తెలుగు టపాలు టప టపా తిరగేస్తున్న నాకు నేను కుడా మేథావి ననే అబద్దం గుర్తొచ్చింది ..గుర్తోచ్చాక ఏ పార్టీ  పోటి చేయకుండా ఉంటుంది..నేను మాత్రం ఎందుకు ఆగాలి అని కవితలనే కథగా మార్చేస్తే పోలా అనే పొగరు తో వగరు గా ఉన్నా ఉసిరి కాయను ఉసేసి ..విసురు గా ఒక వైట్ పేజి ని అందుకున్నాను.. రాయడానికి ఏదో తక్కువైందని ఒక పావుగంట పాటు నా మేథావి బుర్రతో ఆలోచిస్తే అపుడర్తమైంది..నేనొక కొత్త విషయాన్ని కనుక్కున్నా అని ...అదేంటో తెల్సుకోవాలని..మీకు..సాటి తెలుగు వాడిగా మీరు నా గురించి గర్వపడాలని కేవలం మీకు మాత్రమె చెప్తున్నా.. రాయటానికి కావాల్సింది..అతి ముఖ్యమైంది ..పేపరు ఆ తర్వాత మాములు అతి ముఖ్యమైంది పెన్ను..కలము..తమిళ్లో ఏమంటారో తెలీదు..

సరే ఇలా న్యూటన్ పాత్ర నుంచి బయట కి వచ్చి..నేను మళ్ళీ ముళ్ళపూడి బాపు ని అయ్యాను..(నా ఫీలింగ్ మరి )..అయ్యానా..ఇక ఆగకుండా.. రాయడం మొదలెట్టా ..ఓం అని..మొదలెట్టడం ఇంత వీజియా అని అపుడర్థమయింది ..వెంటనే అలిసిపోయా అన్న విషయం అత్యవసర పరిస్థితి (మీరు నేను బాత్ రూం.. ఫ్రెష్ రూం గట్రా అనుకుంటున్నట్టఐతే ..కంగ్రాట్స్..మీరు కూడా నా లానే మేథావి అన్న మాట..).తో తెలియ చేసింది.. ప్రకృతి నా ప్రతిభ కు ఇంతలా మురిసిపోతుంటే ఎం చేస్తాం అని..విజయ గర్వం తో లేచాను..

అదేంటో బయటకి వచ్చాక చూసానా అక్కడ చిందరవందర గా పేజీలు  ..పెన్ను ..బాగా నలిగిపొఇన దిండు కనపడ్డాయి..చ అసలేవరోచ్చారు నా రూం కి..ఈ ఓం ఏంటి పేపర్ల మీద  అని విసుక్కుంటూ రూం ని క్లీన్ చేస్కొని..ఎం చక్క  టి వి చూడటం లో మునిగిపోయాను.. అన్నట్టు ఈ రోజు తేజ సెకండ్ షో లో ఏ సినిమా ?

Aug 16, 2010

గళమెత్తి పాడరా తెలుగోడా ..


కృష్ణదేవరాయ కీర్తించిన తెలుగు సోయగానికి
ఘన గాన గండపేరుండం తో కొత్త సొబగులు దిద్దిన శ్రీరామచంద్ర
దేశ నుదుటిన స్వతంత్ర దినోత్సవ వేళ
తెలుగు కుంకుమ అద్దిన అద్దంకి పాటల ప్రతిభా  పాటవ నవ తరంగమా ..
వర్థిల్లు వర్థిల్లు ..నిండు నూరేళ్ళు ...
తెలుగు తోటలో పూయాలి నీ రాగాల కనకాంబరాలు..

అరవమైన అది కన్నడమైనా 
మళయాళ మొదలైన మన ద్రవిడమేదైనా..
ఉత్తరాది వారికది ఈసడింపు..
ఈ విజయమ్ముతో కలుగు కొంతైనా కనువిప్పు .

తెనుగంటే రుద్రమ్మ తెగింపు కొంత 
తెనుగంటే తిక్కన్న తీపి మరికొంత 
తెనుగంటే తేనేధారల కుండపోత 
తెనుగు వెలుగులకు మొక్కే రాజులే ,మనమెంత?

 గానమ్ము కాదది సమ్మోహనాస్త్రం 
దిగ్గజమ్ములు సైతం  దిగ్భ్రాంతి చెందిన గాంధర్వ రమ్యం
అహరహం శ్రమించు తరగని తపన నిధుల రాగ సంద్రం  
ఎన్నేళ్ళ ఎన్నాళ్ళ తెలుగు చూపులు వేచిన ఉషోదయం

నీ పాట మోగాలి  మాగాణి మురవంగా 
నీ రాగం కదలాలి పైరుపాపల కలవంగా 
నీ గానం కురవాలి దేశ నేలపై తెలుగు గంగగా
నీ భవితమ్ము విరియాలి  మరో బాలు వై వెలగ 

Jul 28, 2010

ఎలా ?

 
నేడనేది ప్రశ్నార్థకం అయినపుడు నేను ఏ ప్రాంతానికి చెందినవాడినో ఎలా చెప్పాలి ?
పురిటి లో పిల్లల ఉనికే సమాధానం లేని సమస్య అయినపుడు నేను ఎక్కడ పుట్టానో ఎలా గుర్తుంచుకోవాలి ?


 మాతృదేవతలనే మహామ్మరులు కాటేస్తుంటే మనిషి గా నేనేంటో రేపటికి ఏం తెలియచేయాలి ?

ప్రజల ఆస్తులు పదవుల్లో ఉన్న పెద్దలు పంచుకుంటుంటే పసి పిల్లల కళ్ళ లోకి నేరుగా ఎలా చూడాలి?

ప్రశ్నలే ఊపిరి తో పాటు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే సమాధానాన్ని అన్వేషించే అంతర్నేత్రం ఎలా తెరుచుకోవాలి ?

మన స్వార్థం మానవాళి అర్థాన్నే మింగే ప్రయత్నం చేస్తుంటే అసలు రేపటి గురించి నేను ఎందుకు ఆలోచించాలి ?


అన్ని ప్రశ్నలే ...


ఆనందాన్ని అందివ్వాల్సిన మనం...ఖాలీ చేసిన గనులు ...కబ్జా చేయగా మిగిలిన భూమిని  బహుమతి గా భావి తరాలకిద్దాం..!


ఒజోనే లేని వాతావరణాన్ని ..మాస్కులతో బయటికేల్లె పరిస్తితులను ప్రశాంతం గా వదిలేల్దాం ...మనం పయనిద్దాం..


మన నుంచి నా కి...
మనస్సాక్షి నుంచి లాభాపేక్ష లో కి
ప్రశాంతత నుంచి యుగాంతం లోకి..


శుభ ప్రయాణ ప్రాప్తిరస్తు...! 

May 8, 2010

అమ్మ..























అమ్మ..


రెండక్షరాల ప్రేమను పూర్తిగా నిర్వచించే పదం..
పెదాల కలయికలో జనించే ఈ పదం విన్నపుడల్లా జనని కై నా చేతులు కలుస్తూనే ఉంటాయి.


నమస్కారమే కృతజ్ఞ్యత కు తార్కాణమైతే ఆజన్మాంతం అమ్మ కై నా చేతులు విడివడవు.




ప్రాణాన్ని పంచి పేగు ని తెంచి తను పునర్న్జన్మ ఎత్తి మనకు ఈ లోకాన్ని చూపే ఆ మాతృ మూర్తి మమత కు మరేది లేదు సాటి.
కన్న వారిని కంటికి రెప్పల కాపాడే ఆ చల్లని స్పర్శ ఉన్నంత కాలం లోకం లో సమస్యేలేవి మనల్ని తాకవు.


ప్రపంచం తలనొప్పి గ అనిపిస్తున్నపుడు ..పరిగెత్తుకుంటూ అమ్మ ఒడిలో చేరు.. ప్రశాంతత నిను వెతుక్కుంటూ వస్తుంది.


మొదటి సరిగా  తెలుగు భాష చిన్నదేమో. అనిపిస్తుంది..అమ్మ ని వర్ణించటానికి
ఐనా అమ్మే విశ్వజనీనమైన్పుడు  ఏ భాష ఐనా సరిపోదేమో.


దేవుడు లేడనే వాడు కూడా తలవంచి నమస్కరించే  దేవత ..తల్లి !

May 3, 2010

చిట్టి చిట్టి చిన్నారులు






నేటి నిజాలన్నీ రేపటికి సత్య దూరమవ్వచ్చు..
నీలాకాశాన్ని కారు మేఘాలు అలుముకోవచ్చు ..
మల్లె తెల్లదనం మాపటికి వాడిపోవచ్చు ..
గగనాన్ని వదిలిన జలరాశి జనని అవని ని చేరేలోగా  ఆమ్లక్షారాది గా మారొచ్చు..


స్వచ్చత అనేది మచ్చుకు కూడా లేదని చింతిచే క్షణం లో...
ఒక్కసారి.. 

బొండు మల్లెలు విరజిమ్మే బోసి నవ్వు ని
చల్లని వెన్నెల ని పంచె చిన్ని కళ్ళని
చూడండి..
కాంక్రీటు వనం లో పచ్చని  పల్లె చేలు  దర్శనమిస్తుంది,,
రణగొణ ధ్వనుల మద్య  కృష్ణశాస్త్రి  పద్యం పాడుతుంది
మానవత్వం తత్వమంటే ఏంటో సోక్రటీసు సుప్రభాతం లా చేప్తున్నటు ఉంటుంది..


పసి మనసు కి పరాయి వాళ్ళ మీద పడే ఈర్ష్య తెలీదు.. పైకెత్తి ఆడిస్తే ప్రశాంతంగ నవ్వటం తప్ప..
ఆ చిట్టి చేతికి మనిషిని మనిషే ఎలా సమాది చేస్తున్నాడో తెలీదు..అంతా నా వారే అనుకోని చేయి అందివ్వటం తప్ప..


సృష్టి లో నిర్మలత్వం ఎక్కడో లేదు..చిట్టి చిట్టి చిన్నారుల మనస్సులో ఉందని..
మట్టి తగిలినా మలినమవని...
మబ్బు కమ్మినా చీకటి కాని ..ఆ అమాయకత్వం .. 
సరిగా నను గమనిస్తే యావత్ ప్రపంచం ప్రశాంతం గా ఉండవచ్చని సందేశం ఇస్తున్నట్టు ఒక భ్రమ..
కాదు..ఆ దేవుడే మనల్ని మారమని ఈ చిన్నారుల ద్వారా మనకిచ్చే ఆదేశమేమో..
అపుడే కరిగిన మంచు బిందువు లాంటి ఆ పవిత్ర పాద స్పర్శ నాకైతే ఏదో చెప్తున్నట్టు వింత భావన.!

Mar 8, 2010

ఓ మహిళ నీకు వందనం




స్త్రీ..
సృష్టి ని గర్భాన మోస్తున్న విశ్వ మూర్తి వి నువ్వు..
ప్రేమ వృష్టి కి అంకురార్పణ చేసిన శ్యామ జలధి వి నువ్వు..


ప్రాణ ప్రయాణం కాల ప్రవాహం లో అనంత గీతం లా శ్రావ్యం గ సాగటానికి ఆది వి నువ్వు..
త్రిమూర్తులను పంచ భూతాల లక్షణాలను నింపుకున్న నడిచే జగానివి నువ్వు..
ప్రేమ ను ప్రాణాన్ని పంచటానికి దైవం నిర్దేశించుకున్న దిక్సూచి నువ్వు..


నీ చూపు కుసుమ సున్నితమైతే మమత జనితమే..
నీ రూపు ఆగ్రహ ఉగ్రమైతే  వినాశ విన్యాసమే..


 సౌందర్యమన్న పదానికి అర్థం నువ్వు..సౌకుమర్యానికి నిర్వచనం నువ్వు..
నువ్వు నీ నవ్వు లేని లోకం శోకమే..

అవతారాలు దేవునికి కాదు నీకు ..
పాపాయి నుంచి పడుచుకి..
పడతి నుంచి మహిళకు,..
మాత్రు మూర్తి నుంచి మమతా దీప్తి..కి..
ప్రౌడ కాంతి నుంచి ముత్తైదువ ముగ్దత్వానికి..
పెద్దతనపు ఆరింద నుంచి జీవిత సారహితమైన అమ్మమ్మ కి ..


నీ గమనమే.. లోక ప్రయాణం..
నీ లాంటి అద్భుతాన్ని నీవే సృష్టించగల  అద్వీతియం..


అమ్మ అన్న ఒక్క పిలుపు చాలు..నిన్ను గౌరవించటానికి ..
అందం అన్న ఒక్క పదం చాలు నిన్ను నిర్వచించటానికి ..
ఆనందం అన్న ఒక్క భావం చాలు నీ అనుభూతి ని చెప్పటానికి ..
సర్వం అన్న ఒకే ఒక్క మాట చాలు నిన్ను పోల్చటానికి..


అధికారం మాదే అని మగ మీసం మురవటానికే నీ మౌనం..
కావాలనుకుంటే అది నీకు  కరతామలకం..అత్త్యంత సునాయాసం


ఓ     స్త్రీ .. నీకు ధరణి   దృక్ సహిత శిరో వందనం..
ఇంతకన్నాఏమీ చేయలేని..మీ రుణాన్ని తీర్చలేని...
వ్యాఘ్ర ముఖ మేష గాంభీర్య ధారులం !!

Feb 14, 2010

ప్రేమ మయం

ప్రేమ అంటే నమ్మకం అని అమ్మ మొదటి సారి నాన్నని చుపించినపుడు
అదే  అమ్మ తనని ఎత్తుకుని ఎగరేస్తున్నపుడు
చిన్నారికి తెలుస్తుంది...మనసు లో ఆ మమత పుష్పం వికసిస్తుంది


తన చదువు కి తల్లితండ్రుల తపనని చూసో ..
తనకై వాళ్ళ కష్టాలను చూసో ..
ఆ పుష్పం మరింతగా పరిమళిస్తుంది ప్రేమతో..


కాని సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే ప్రేమికుల దినోత్సవం నాడు
అదే మనసు అదే పువ్వుని వేరొకరి చేతి కి ఇవ్వడానికి
ఆశ పడుతుంది..
కొన్ని సార్లు ప్రేమ రుచి చూపినందుకు కన్న వాళ్ళనే కాదనేందుకు కూడా సిద్దపడుతుంది .\


ప్రేమ అనేది ఇచి పుచుకునేది అని మనసు తెల్సుకునే సరికి పాపం కన్న వారికి ఇవ్వడానికి ఏమీ మిగలదు
ఇవ్వడానికి మన మనసే మన దగ్గర ఉండదు..
అది తోడు కై జత గ బతికే నీడకై గూగుల్ నీ కుడా వదలకుండా సెర్చ్ చేస్తుంటుంది..


ఈ వయసు కి మన కు తోడు అవసరమే.. వెతకడం కుడా సహజమే.
ఎందుకంటే తుమ్మెద పుష్పాన్ని తాకినపుడే సృష్టి గెలిచినట్టు !!
కాని అదే ప్రేమ మన జన్మ కి కారణమైన వాళ్ళ మీద కాస్త చూపించడమే మనం మరిచిపొఇన్ది.


మనకు ప్రేమ పంచె వారికి వెతకటం లో మన ప్రేమ పంచాల్సిన వాళ్ళను దూరం చేసుకుంటున్నాం ..
ప్రేమ కు అర్థం చుఉపిన వారికి ప్రేమ కు నెలవైన ఈ రోజున ఒక రోజా ఇస్తే వాళ్ళు పులకరిస్తారని విస్మరించాం..


ప్రేమ అంటే విశ్వజనీనమైనదని అనడానికి జనని చూపే ప్రేమే ఆది కాబోలు..
అందుకే ప్రేమ మయం ఐన జగతిలో ప్రేమ అంటే కేవలం యువత కలలు కనే కవితలు రాసే ప్రేమే కాదు...
మన మీద మమకారం చూపే ప్రతీ మనసు లో ఉన్నది ప్రేమే..
మనకై తపించే ప్రతీ స్పర్శ లో ఉన్నది ప్రేమే..
ప్రేమ కి పునాది నమ్మకం అయినపుడు నమ్మకానికి  నెలవైన అమ్మ ప్రేమని మించినది ఏది లేదని నా నమ్మకం,,
కనీసం నా మనసు ఒక తోడు కోసం వెతకనంత వరకు నా నమ్మకానికి తిరుగు లేదు ..
ఆ తర్వాత నాకు నమ్మకం లేదు..ఎందుకంటే నేను ఈ కాలపు యువకున్నే కాబట్టి..