Jun 18, 2009

తెలుగు-దిగులు

ఆకాశం సూర్యోదయం వెన్నెల తొలకరి ...ఇలా ఎన్నో తెనెలూరే తెలుగు మాటలు విని ఎన్నో జన్మలైనట్టుంది..
ఆగని ఉరుకుల పరుగులతో.. అలసట నిండిన రోజులతో
కనురెప్పలు బతిమాలుకునే పని ఒత్తిడి లో
పచ్చని రంగు కాగితాల పాకులాటల ముందు కలలు కవితలు ఆనందాలు అనుభూతులు అన్నీ పరాయి అయ్యాయి..బరువు అయ్యాయి..


చిన్నప్పుడు చందమామ ను చూపి గోరుముద్దలు పెట్టిన తల్లులను గూగుల్ లో వెతికినా ఇప్పుడు కనపడరు..
పాదాలకు పారాణి తో పైర గాలికి వంత పాడే పావడ తో పరిగెత్తే పదహారేళ్ళ అందాలన్నీ ఎప్పుడో జీన్స్ టీ షర్ట్స్ తో జట్టు కట్టాయి


తెలుగు వాళ్ళం తెలుగు లో నే మాట్లాడుకుందాం అని తెగ దంచే వాళ్ళే తెలుగు తెలీనట్టు మాట్లాడటం నేడు చాలా సాధారణం.
మనం తెలుగు వాళ్ళం అని గుర్తు చేస్తేనే తప్ప తెలుగు మాట్లాడని మన దౌర్భాగ్యానికి మనం కాస్తైన సిగ్గు పడం ..మమ్మీనే ముద్దని అమ్మని మారుస్తాం...నాన్న వద్దని డాడి తో మురుస్తాం...


కంప్యూటర్లు తప్ప కమ్మనైన కోకిల గానం తెలీని మనం
వెబ్ ప్రపంచం తప్ప వెన్నెల వెలుగులను చూడని మనమా
మన ఘనమైన గతాన్ని భవితవ్యానికి మోసుకేల్లేది..
మన వారసులకి ఇచ్చేది ...


ప్రశ్నించుకుంటే నే పరిస్తితి కాస్తైన మారేది...
మార్పు మొదలైతే నే మన ఉనికి భవితవ్యానికి తెలిసేది..


తెలుగు భాష ఒకప్పుడు దివ్యం గా వెలిగేది అని రేపు చెప్పుకునే రోజు రాకూడదనే ఈ ప్రయత్నం..
మా తెలుగు తల్లి కి మల్లెపూదండ !!!