Aug 29, 2010

జయహో తెలుగు తల్లి !!

వెన్నెల జిలుగులు , చిన్నారి నవ్వులు ,
తేనె ధారల జలపాతాలు
అన్నీ కలిపితే తేట తెనుగు పదాలు ..


అఖండ భారతావని లో ..అనేక భాషల నడుమ ..సంస్కృతుల నడుమ ..
నన్నయ్య తొలి అక్షరమై ..తిక్కన చెక్కిన చక్కని సాహితి శిల్పమై ..ఎర్రన ఎలుగేతిచాటిన పద్యమై ..
శ్రీనాథుని నోట శృంగార రసమై .పోతన పోతపోసిన భాగవతమై ఇంతింతై వటుడింతై అన్న చందాన
ఛందస్సు చీర తో అలంకరాది ఆడంబరాలతో అలంకరించబడినదిఐ ..అన్య భాషా సామ్రాట్టులు సైతం .
జయహో అని ప్రశంసించిన ప్రశస్తమైన పంచదార ధార.. తెలుగు..


ప్రభందాలను పాపిట దాచుకుని కావ్య రాశులతో దివ్య అలంకృతమై, కమనీయ కథనాల ..వీనుల విందైన కవనాల ఆభరణాలతో ..యతిప్రాసాది ఆహర్యముతో ..శతాబ్దాల తరబడి చక్కర వానను చిలకరిస్తున్న యశస్వి ..నిత్య జవ్వని తెలుగు..


మన భాష మనకు ముద్దు ..అన్న హద్దు ని దాటి అఖండ  దక్షినావని ని ఏలిన ..ఆంధ్ర భోజుని .ఆముక్తమాల్యద కి వామహస్తాన వయ్యారి చిలకై.. అతని రచనల మకుటాన నీలి వజ్రమై వెలుగొందింది.

రాయల గళసీమన రవ్వల పతకమై..భువన విజయ సభన అష్టదిగ్గజాల అభిసారికయై ..
అల్లసాని వారి జిగిబిగి ని నింపుకుని ...ధూర్జటి వారి ధీరో ధాత్త ధవళ కాంతులు ప్రసరింపచేస్తూ ..తెనాలి రామలింగడి తికమకను చతురతను చిందిస్తూ ..స్వర్ణయుగాన్ని లిఖించింది ..కదళీఫలపాక  సమాన కావ్య కన్య ..ఆమెపేరు తెలుగు..


కాల గమనాన గ్రాంధిక అంతః పురాన్ని విడిచి  వ్యావహారిక వస్త్రధారణ తో జనాల  నడుమకు చిటికెన వేలు ను పట్టుకుని తెలుగుని నడిపించిన సాహసి ..
తెలుగు అమ్మ అయితే ..మనం మామా  అని పిలుచుకోదగిన..మాతృభాషాదాహార్తి  గిడుగు రామమూర్తి ..

గ్రంధాలయాల చీకటిన మ్రగ్గిన ఆంధ్రభాషను అందరి నాలుకల మీద నాట్యం చేయించిన భగీరథ సమాన గిడుగు వారి జన్మ దినమే నేటి మన తెలుగు భాషా దినోత్సవం ..



తెలుగు వెలుగులు మరింత ప్రజ్వలితం అవుకాక..
గిడుగు వారి ఆశ కాలచక్ర అడుగడుగునా  ప్రతిఫలించు గాక

1 comment:

  1. pramod గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!

    హారం

    ReplyDelete

comment here whatever u want to.but please dont forget to put ur name also..have a great day