Aug 29, 2010

జయహో తెలుగు తల్లి !!

వెన్నెల జిలుగులు , చిన్నారి నవ్వులు ,
తేనె ధారల జలపాతాలు
అన్నీ కలిపితే తేట తెనుగు పదాలు ..


అఖండ భారతావని లో ..అనేక భాషల నడుమ ..సంస్కృతుల నడుమ ..
నన్నయ్య తొలి అక్షరమై ..తిక్కన చెక్కిన చక్కని సాహితి శిల్పమై ..ఎర్రన ఎలుగేతిచాటిన పద్యమై ..
శ్రీనాథుని నోట శృంగార రసమై .పోతన పోతపోసిన భాగవతమై ఇంతింతై వటుడింతై అన్న చందాన
ఛందస్సు చీర తో అలంకరాది ఆడంబరాలతో అలంకరించబడినదిఐ ..అన్య భాషా సామ్రాట్టులు సైతం .
జయహో అని ప్రశంసించిన ప్రశస్తమైన పంచదార ధార.. తెలుగు..


ప్రభందాలను పాపిట దాచుకుని కావ్య రాశులతో దివ్య అలంకృతమై, కమనీయ కథనాల ..వీనుల విందైన కవనాల ఆభరణాలతో ..యతిప్రాసాది ఆహర్యముతో ..శతాబ్దాల తరబడి చక్కర వానను చిలకరిస్తున్న యశస్వి ..నిత్య జవ్వని తెలుగు..


మన భాష మనకు ముద్దు ..అన్న హద్దు ని దాటి అఖండ  దక్షినావని ని ఏలిన ..ఆంధ్ర భోజుని .ఆముక్తమాల్యద కి వామహస్తాన వయ్యారి చిలకై.. అతని రచనల మకుటాన నీలి వజ్రమై వెలుగొందింది.

రాయల గళసీమన రవ్వల పతకమై..భువన విజయ సభన అష్టదిగ్గజాల అభిసారికయై ..
అల్లసాని వారి జిగిబిగి ని నింపుకుని ...ధూర్జటి వారి ధీరో ధాత్త ధవళ కాంతులు ప్రసరింపచేస్తూ ..తెనాలి రామలింగడి తికమకను చతురతను చిందిస్తూ ..స్వర్ణయుగాన్ని లిఖించింది ..కదళీఫలపాక  సమాన కావ్య కన్య ..ఆమెపేరు తెలుగు..


కాల గమనాన గ్రాంధిక అంతః పురాన్ని విడిచి  వ్యావహారిక వస్త్రధారణ తో జనాల  నడుమకు చిటికెన వేలు ను పట్టుకుని తెలుగుని నడిపించిన సాహసి ..
తెలుగు అమ్మ అయితే ..మనం మామా  అని పిలుచుకోదగిన..మాతృభాషాదాహార్తి  గిడుగు రామమూర్తి ..

గ్రంధాలయాల చీకటిన మ్రగ్గిన ఆంధ్రభాషను అందరి నాలుకల మీద నాట్యం చేయించిన భగీరథ సమాన గిడుగు వారి జన్మ దినమే నేటి మన తెలుగు భాషా దినోత్సవం ..



తెలుగు వెలుగులు మరింత ప్రజ్వలితం అవుకాక..
గిడుగు వారి ఆశ కాలచక్ర అడుగడుగునా  ప్రతిఫలించు గాక

Aug 27, 2010

రేపనేది రాయల కాలం కాకపోతుందా...

వెన్నెల అంతా వెక్కి వెక్కి ఏడుస్తుంది..
తన గురించి తపించే కవులు కలువలు కనిపించటం లేదని..
వేదన వికటాట్టహాసం చేస్తుంది..
తను కొలువు కాని కన్నులు లేవని..తను ఆక్రమించని హృదయ సామ్రాజ్యాలు లేవని..



ఒకప్పుడు పచ్చని చేలవెంట నా సిరా ప్రవహించేది
ప్రకృతి చీర అంచు మీద నా మనసు ముగ్గయ్యేది
 కలం నా చేయి ని పట్టుకుని కలల  తీరాలకు తీసుకెళ్ళేది
ఆవేశం పలకరించినపుడు శ్రీ శ్రీ వారి ఇంటివైపు పరిగేట్టేది ..


 కనుపాప కమిలిన నరాల ఒత్తిడి లో
 నన్ను నేను పూర్తిగా తాకట్టు పెట్టుకుని
 నెలాఖరుకి ఊగె నాలుగు పచ్చ కాగితాలకు
మారు మాట్లాడకుండా తెల్లోడికి  తలప్పిగించేస్తున్నా..


 రేపనేది రాయల కాలం కాకపోతుందా అని ఆశ
ఆశ కైనా అంతు ఉండాలి రా అని అంతరాత్మ ప్రభోధ


ఎర్రబడ్డ మెదడు లోంచి 
ఏవో సన్నని మూలుగు లు ..
పదకొండో అవతారం కోసం పడిగాపులు..


కథ ...నిజం ..కావాలంటే చదవండి

అప్పుడెప్పుడో ..అంటే ఓ ఆరు గంటల క్రితం ..తెలుగు టపాలు టప టపా తిరగేస్తున్న నాకు నేను కుడా మేథావి ననే అబద్దం గుర్తొచ్చింది ..గుర్తోచ్చాక ఏ పార్టీ  పోటి చేయకుండా ఉంటుంది..నేను మాత్రం ఎందుకు ఆగాలి అని కవితలనే కథగా మార్చేస్తే పోలా అనే పొగరు తో వగరు గా ఉన్నా ఉసిరి కాయను ఉసేసి ..విసురు గా ఒక వైట్ పేజి ని అందుకున్నాను.. రాయడానికి ఏదో తక్కువైందని ఒక పావుగంట పాటు నా మేథావి బుర్రతో ఆలోచిస్తే అపుడర్తమైంది..నేనొక కొత్త విషయాన్ని కనుక్కున్నా అని ...అదేంటో తెల్సుకోవాలని..మీకు..సాటి తెలుగు వాడిగా మీరు నా గురించి గర్వపడాలని కేవలం మీకు మాత్రమె చెప్తున్నా.. రాయటానికి కావాల్సింది..అతి ముఖ్యమైంది ..పేపరు ఆ తర్వాత మాములు అతి ముఖ్యమైంది పెన్ను..కలము..తమిళ్లో ఏమంటారో తెలీదు..

సరే ఇలా న్యూటన్ పాత్ర నుంచి బయట కి వచ్చి..నేను మళ్ళీ ముళ్ళపూడి బాపు ని అయ్యాను..(నా ఫీలింగ్ మరి )..అయ్యానా..ఇక ఆగకుండా.. రాయడం మొదలెట్టా ..ఓం అని..మొదలెట్టడం ఇంత వీజియా అని అపుడర్థమయింది ..వెంటనే అలిసిపోయా అన్న విషయం అత్యవసర పరిస్థితి (మీరు నేను బాత్ రూం.. ఫ్రెష్ రూం గట్రా అనుకుంటున్నట్టఐతే ..కంగ్రాట్స్..మీరు కూడా నా లానే మేథావి అన్న మాట..).తో తెలియ చేసింది.. ప్రకృతి నా ప్రతిభ కు ఇంతలా మురిసిపోతుంటే ఎం చేస్తాం అని..విజయ గర్వం తో లేచాను..

అదేంటో బయటకి వచ్చాక చూసానా అక్కడ చిందరవందర గా పేజీలు  ..పెన్ను ..బాగా నలిగిపొఇన దిండు కనపడ్డాయి..చ అసలేవరోచ్చారు నా రూం కి..ఈ ఓం ఏంటి పేపర్ల మీద  అని విసుక్కుంటూ రూం ని క్లీన్ చేస్కొని..ఎం చక్క  టి వి చూడటం లో మునిగిపోయాను.. అన్నట్టు ఈ రోజు తేజ సెకండ్ షో లో ఏ సినిమా ?

Aug 16, 2010

గళమెత్తి పాడరా తెలుగోడా ..


కృష్ణదేవరాయ కీర్తించిన తెలుగు సోయగానికి
ఘన గాన గండపేరుండం తో కొత్త సొబగులు దిద్దిన శ్రీరామచంద్ర
దేశ నుదుటిన స్వతంత్ర దినోత్సవ వేళ
తెలుగు కుంకుమ అద్దిన అద్దంకి పాటల ప్రతిభా  పాటవ నవ తరంగమా ..
వర్థిల్లు వర్థిల్లు ..నిండు నూరేళ్ళు ...
తెలుగు తోటలో పూయాలి నీ రాగాల కనకాంబరాలు..

అరవమైన అది కన్నడమైనా 
మళయాళ మొదలైన మన ద్రవిడమేదైనా..
ఉత్తరాది వారికది ఈసడింపు..
ఈ విజయమ్ముతో కలుగు కొంతైనా కనువిప్పు .

తెనుగంటే రుద్రమ్మ తెగింపు కొంత 
తెనుగంటే తిక్కన్న తీపి మరికొంత 
తెనుగంటే తేనేధారల కుండపోత 
తెనుగు వెలుగులకు మొక్కే రాజులే ,మనమెంత?

 గానమ్ము కాదది సమ్మోహనాస్త్రం 
దిగ్గజమ్ములు సైతం  దిగ్భ్రాంతి చెందిన గాంధర్వ రమ్యం
అహరహం శ్రమించు తరగని తపన నిధుల రాగ సంద్రం  
ఎన్నేళ్ళ ఎన్నాళ్ళ తెలుగు చూపులు వేచిన ఉషోదయం

నీ పాట మోగాలి  మాగాణి మురవంగా 
నీ రాగం కదలాలి పైరుపాపల కలవంగా 
నీ గానం కురవాలి దేశ నేలపై తెలుగు గంగగా
నీ భవితమ్ము విరియాలి  మరో బాలు వై వెలగ