May 19, 2021

ఎలా ఉన్నాం

 శ్వాసను మాస్కు తెరలతో

మాటలను భయపు పొరలతో

చేతులను ఆత్మీయ స్పర్శ కు కాక ఆల్కహాల్ సానిటైజర్ తో

రేపంటే అర్థం కాని అయోమయం తో

నేడు ఆరోగ్యం పై అతి శ్రద్ద తో 

అనుమానాల సందిగ్ధత తో

బాగానే ఉన్నాం అనేకన్నా బతికే ఉన్నాం అని సర్దిచెప్పుకునే స్థితితో


మొబైల్ స్క్రీన్ ని దాటని పొడి పదాల పలకరింపులతో..


ఈ కారుమబ్బుల కరోనా తెరలు తొలగి మళ్ళీ మామూలు ప్రశాంత ఆకాశం త్వరలో కనిపిస్తుందనే


ఆశ అనే ఒకే ఆక్సిజన్ మనసుని ఇంకా నడిపిస్తూ...


ఉన్నాం...

గదిలో కదలకుండా నెలలు దాటేస్తూ..

Apr 4, 2020

కరోనా..ఒక హెచ్చరిక నా

మానవాళికి ముప్పులు, రేపు ఇకలేదేమో అనే తిప్పలు కొత్త కావు..
దేవుని అవతారాలకే ముగింపు పాడిన కాల ప్రవాహం ముందు కరోనా పెద్దదేమీ కాదు..

కలకాలం ఉండవు కరువైన కరోనా అయినా..
సమాధానం లేకుండా ఉండవు ప్రశ్న అయిన సమస్య అయినా..

ఈలోపు నీ గుండె నిండా నీకుండాల్సినది
తరగని సహనం సమిష్టి తత్వం సమాజ హితం,
చేయాల్సింది శుభ్రమైన జీవనం, గడప దాటని ప్రయాణo,
పాటించాల్సింది సామాజిక దూరం ప్రభుత్వ నియమ పాలనం.

మేధస్సుతోనో  భయోత్పాత మనస్సుతోనో
ఈ రోజు కాకున్నా మరోరోజు మందు కనిపెట్టి
మనం కనుగొన్న  ఈ పాత మనం ని మళ్లీ పాతిపెట్టి మునుపటిలా రేపటికి ఎదురీదడం ఎంతో దూరం  కాకపోవచ్చు...

కాని..

గడియారం ముల్లు కి కాలి ని కట్టి
గంటగంటకి నరాలని ఒత్తిడిలో నింపి
వారాంతం కోసం వారం అంతా మీరు మీ వాళ్ళు ఎదురుచూసే
యాంత్రిక ధన మాంత్రిక పదవీ తాంత్రిక నిజ భ్రాంతిక
అవిశ్రాంతక సమాజం ..
మన నుంచి పూర్తిగా నాలోకి కూరుకుపోతున్న నైజం
తప్పని,మార్పు తప్పనిసరిగా తప్పదని ప్రకృతి అనుకుందేమో...

రేపటి గొడవ పడవ విడువమని,
నలుగురిలో ఉండటమే సమస్యగా మార్చి,
పనిని నీ వారిని ఒక్క చోట చేర్చి,
బందిస్తే తప్ప భందాల విలువ తెలీదని నేర్పి,

కుగ్రామంగా మారిన ప్రపంచ సరిహద్దులు గ్రామాల వరకూ తిరిగి తెలిసేలా,
మన సంప్రదాయాల మూలాల మహిమ మహివిదితమయ్యేలా,
దూరాన కొండలు కనపడేలా,
వీధుల్లో నెమళ్ళు తిరిగేలా ..
మనీ మగత  వదిలి వీధుల్లో పోసేలా ,

అన్నిటికీ అర్థమే పరమార్థం కాదని
ఈ తరానికి  అర్థమయ్యేలా తెలిపిన ఈ కరాళ కరోనా ...
మృత్యు ఘంటిక మాటున దాచిన ఘాటైన మరో మాటిదేనా..

మన ఉనికి భూమికే ప్రమాదమైతుందనా,
మనం మారాలి మారి తీరాలి అనే హెచ్చరికనా,
సంస్కృతి సంప్రదాయాలు శుద్ధ దండుగ కాదనా,
ధనం దర్పం కాదు నేను సైతం సమాజ హితం అనమనా..
ఏమో...??

కరోనా అంతరించాలి ..
ప్రశాంతత సంతరించాలి
నవయుగ విజ్ఞానం తో నిండు హాయి కుండలా,
ఆనాటి మన తాతల్లా
ఈరోజు తృప్తితో రేపటికి ఆశతో
ఉండమనే  సందేశం అందరికీ అందాలి.

సర్వేజనా సుఖినోభవంతు!!

  - ప్రమోద్ దర్భశయనం

Dec 31, 2019

అమాయకుడివి

వెలుగు రేఖల్లో కనపడే రంగులలో కాదు 
గాజు కళ్ళల్లో కనపడక దాగున్న భావాలను చూడు .. 
లోకం నిన్ను ప్రశ్నిస్తూ నీ భాద్యత ను చూపిస్తుంది 

ఖర్చుపెట్టే సంపాదనతో కాదు, 
వయసుని ఒత్తిడితో 
కొనగలిగే బరువైన జేబులతో కాదు 
పదాలను వెతుక్కోకుండా మాట్లాడగలిగే మనుషులను మనసులను 
గెలవడంతో ఆనందాన్ని సాధించడం అంటే తెలుస్తుంది 

మనసుని నేను నాదితో  నింపి 
కాలానికి శ్వాసని బందించి 
పరిగెత్తక తప్పని 
ఆగి ప్రశ్నిస్తే తప్పనే 
అసహజత్వ భ్రమణమే సహజమనుకునే  సమాజంలో 
అందరిలో ఉన్న నువ్వెవరో నీకే తెలియని ఒంటరివి 
అందరిలానే నువ్వు రాయలేని నీ చరితను మొక్కుబడిగా 
రొప్పుతూ లాగిస్తున్న అన్నీ తెలిసిన అమాయకుడివి ...!

May 2, 2019

విద్యార్థీ .. తెలుసుకో ఇది!

విద్యార్థీ...
నీ గమన లక్ష్యం జ్ఞానం కానీ , కొన్ని మార్కుల గణనం కాదు!
నీ సాధనాంతరార్థం ప్రజ్ఞా ప్రస్థానం కానీ, ప్రథమ ద్వితీయ స్థానం  కాదు!

పోలికల వైకుంఠపాళిలో  నిన్ను నీవు పావుని చేసి, పరీక్ష అనేది పామా పాళా అని పరితపించే పరిగెత్తడం,
అంకెలతో జీవితానికే సంకెళ్లు వేయడం,
నరాలలో ఒత్తిడిని నింపి,
కళ్ళ లో కాలిక్యులేటర్ని తయారు చేసి,
కాగితాలలోకి మెదడును పంపి, పరువనే భ్రమ కి జీవితాల బరువును పెట్టి,
మస్తిష్క సామర్ధ్యానికి మన అస్తిత్వానికే పెట్టే పరీక్షలా విలువని ఇవ్వడం,

ఇది కాదు మన విద్యా విధానం,
ఇది కాదు అనాదిగా ఆశ్రమాలనుంచి వస్తున్న ఆచార్యుల ఆశయం.

మూస సమూహంలో మార్కుల సమరంలో,మీ మనసుని మూగగా చేసి, మిమ్మల్ని మీరు  బందీగా మార్చేందుకా మీరు విద్యార్థులు అయింది ?

ప్రతీ విద్యార్థీ పరమాత్ముని ప్రత్యేక నిధి!
నీ ప్రత్యేకతను తెలుసుకుంటే నే అది తెరుచుకునేది !!
నీ అంతరంగం అనంత ఆకాశంలా ,
ఆలోచనా తరంగం స్వేచ్ఛా విహంగం లా ,
ప్రజ్ఞా ప్రయాణం నీ అంతర్వీక్షణంలా,
సమయం నిన్ను సానపెట్టే సాధనంలా,
ప్రతి పరీక్షా  ఫలితానికి కాక ప్రయత్నానికి , సరిదిద్దుకునే ప్రవృత్తికి ప్రతీకలా,

జ్ఞానం సాధించి
నిన్ను నువ్వు గెలచి,
ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారడానికి కదా నీవు విద్యార్థి అయింది!

నీ పరిశ్రమ ..
నిన్నటి నుండి రేపుకి
చీకటి నుండి వెలుగుకి
మరింత మున్ముందుకి
విశ్వ కళ్యాణానికి !

ఒక పరీక్షా ఫలితానికో కాదు!
మూడు అంకెల మార్కులకో కాదు!!

ప్రపంచానికి విద్య చెప్పిన భారతావనిలో పుట్టిన విద్యార్థీ! తెలుసుకో ఇది!!

May 14, 2018

అమ్మ

దేవుడు లేడనే వాడు కూడా తలవంచి నమస్కరించే  దేవత అమ్మ...

ఏమని నిర్వచించాలి అమ్మని..

కరుణకు ఉదాహరణ అనా..
మమతకు మరోపేరనా..
స్వార్థం గెలవలేని బంధమనా..
అసలు మన శ్వాసయే తన భిక్ష అనా..

భాష చిన్నపోయె భావం అమ్మ
జన్మ తాకట్టు పెట్టినా తీర్చలేని ఋణం అమ్మ

సముద్రునికి మంగళ స్నానంలా
సూర్యునికి మంగళ హారతిలా
కొలవలేని ప్రేమకు నాకు తోచిన పదనీరాజనం!
మమకార మూర్తిని తెలుగు తేనెలతో అభిషేకించ చిన్ని ప్రయత్నం!!

Dec 31, 2017

తెలుగు - ఘన యశస్వీ నిత్య తేజస్వీ


యాభయ్యారు అక్షరాల వయ్యారి నండూరి తెలుగు

పదహారు అణాల పద్ధతైన అమృత వర్షిణి తెలుగు

కువకువల వేకువన పోతన పోత పోసిన పద్య శిల్పం తెలుగు

పొద్దెక్కుతున్న ఆకసం అద్దుకున్న కాళోజీ మాటల ఎరుపు తెలుగు

పంచదినోత్సవ ప్రపంచ తెలుగు మహా సభల సంబురాలు

అనంత భావగర్భిత అద్భుత అమ్మ భాషకు అద్దుతున్న సొభగులు

తెలుగువాడిగా తెలంగాణ బిడ్డగా గర్వపడే ఘడియలు

తెలంగాణ తొలి తెలుగు పరుగు శ్రీకారసమయాన శుభాభినందనలు

అఖండ భారతావనిలో అనేక భాషల నడుమ

మహా శైవ క్షేత్రమైన వేములవాడలో జైన సాహిత్య తొలి లిఖితమై

మల్లియ రేచన కవిజనాశ్రయంతో తొలిసారి ఛందోబద్ధమై

మహాకవి నన్నయ్య నానారుచిరార్థముగా దిద్దిన తొలి తిలకమై

మనకవి పాల్కురికి అద్దిన తొలి శతక సింగారపతకమై

కవిబ్రహ్మ తిక్కన చెక్కిన చక్కని సాహితీ శిల్పమై

ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱన ఎలుగెత్తి చాటిన అరణ్య పర్వ పద్యమై

సహజకవి పోతానామాత్య బాలరసాలసాల భాగవత భరితయై

కవిసార్వభౌమ శ్రీనాథుని నోట శృంగార రస జనీతయై

అన్నమాచార్య అందించిన భక్తి వైరాగ్య వాగ్గేయ వనితయై

కవయిత్రి మొల్ల గుఛ్చిన మల్లెమాల రామాయణ రజితయై

ఇంతింతై వటుడింతై అన్న చందాన

అన్యభాషా సామ్రాట్టులు పాశ్చాత్య సత్య శోధకులు సైతం

జయహో అని ప్రశంసించిన ప్రశస్తమైన పంచదార ధార తెలుగు

వింటుంటే వంద పండుగలు అందరం కలిసిచేసిన సంతసమ్ము కలుగు

ప్రభందాలను పాపిట దాచుకుని

కావ్యాలంక్రిత కాటుక కన్నులతో

వీనులవిందైన కవితకవన కర్ణభారణములతో

చిత్రశబ్ద సహిత ఛందస్సు చీరతో

అలంకారసమాసాది ఆడంబరాలతో

యతిప్రాసాది రమ్య గమన ఆహార్యముతో

వచనగేయ పదరచనా ఘట్టనా మధురిమతో

శతాబ్దాల తరబడి తరగని శరత్చంద్రుని వెన్నెలని

శైశవ భానుని అరుణా వర్ణయుక్త వేకువని

కలగలిపి కళలోలికి

భావచిత్ర సంచితయై భాషావిహంగ విలక్షణ ధ్వనితమై

పండితపామరుల హృదయాకాశాన ప్రకాశిస్తున్న

యశస్వి తెలుగు, నిత్య జవ్వని తెలుగు

రాయల గళ సీమన రవ్వలపతకమై

భువనవిజయసభన అష్టదిగ్గజ అభిసారికై

గోన బుద్దారెడ్డి బుడిబుడి ద్విపద పద్యమై

విద్యానాధుని లక్షణాలంకృతమై వెలిగిన పద్యప్రణయీ తెలుగు

నవనవోన్మేషమై యుగయుగప్రవర్తమానమై ఫరిఢవిల్లినది తెలుగు

కాలాగమనాన గ్రాంధిక అంతఃపురాన్ని విడిచి

వ్యావహారిక వస్త్రధారియై జనాల నడుమకు

గిడుగు రామమూర్తి వేలు పట్టుకుని

గురజాడ వారి అడుగుజాడలలో

కృష్ణశాస్త్రి కిన్నెరసానిలా లలిత కలితమై

దాశరధి మ్రోగించిన కోటి రతనాల వీణతో

విశ్వనాథుని వేయి పడగల హొయలతో

శ్రీశ్రీ కంటిన ఎర్ర జీరయి కాళోజి గొంతున ప్రజా గొడవై

మనసుకవి ఆత్రేయ ఆర్థ్రతయై

సినీకవి సిరివెన్నెల మూటయై వేటూరి పాటయై

సినారె మధుర జ్ఞ్యానపీఠమై గోరేటి గల్లీలో సంతయై

దశశ్రీ వచన వాగ్ధాటివై అందెశ్రీ అందించిన జయగీతమై

సుద్దాల పదాలను ముద్దుగా హత్తుకున్న వీరగానమైన

విలక్షణ భారత యశోవేణి తెలుగు

తెలంగాణా మాగాణి మహారాణి తెలుగు

 

చిన్నారులనుంచి చక్రవర్తులదాకా

పల్లెపల్లెనుంచి పాశ్చాత్యులవరకు

ఛందోబద్ద చద్దిమూటైన నేటిధాటీ వచనపచనమైనా

మోహినీ అమృతకలశాన్ని ఇంతింత ఒలికించి

పలుకవుల కలాలలో అంతంత నింపి

కోకిలాగానానికి చెరకు తీపిని కలిపి

నేడు చంద్రశేఖర ప్రపంచ ప్రశస్త సంకల్పమై

పూర్వ సంపూర్ణ యశోపునఃప్రభాభాసితాశితమై

మహాహాయిని కలిగించే మకరంద దాయినీ రచనా రమణీ

ఉజ్వల ఉత్పలకందోచంపకీ కథా కవితా కమనీ

ఆమె పేరు తెలుగు, ఆగని దశదిశా విస్తరిత వెలుగు

తెలుగువాళ్ళందరి చిక్కని చిరునవ్వుకి

తెలంగాణా రతనాల కథనాన్ని జతచేస్తూ మురిసిపోతుంది మనభాష!

ఇలాగే ఉషోదయభాస్కర భాసితమై ప్రబంధ పలురచనావచనార్థరంజితమై వెలుగొందాలని మా ఆందరి ఆశ!!

తప్పక తప్పని సత్యమని అంటోంది నా మది, ఎందుకంటే

తెలుగంటే తిక్కన్న తీపి కొంత

తెలుగంటే రుద్రమ్మ తెగింపు కొంత

తెలుగంటే తేనే ధారల కుండపోత

తెలుగు వెలుగులు మ్రొక్కే రాజులే, మనమెంత!

                    

                                    -- దర్భశయనం ప్రమోద్ కుమార్

Jun 18, 2017

నాన్నకు ప్రేమతో

ప్రేమను నిర్వచించే కమ్మని కవిత అమ్మయితే
ఆ నిర్వచనానికి నిలువెత్తు నిశ్శబ్ద నిదర్శనం నాన్న!

కనిపెంచే కడుపు తీపి అమ్మ అయితే
కనిపించని తపనల కనుల తడి నాన్న !

అనురాగపు ఆరాటాల ఆర్తి అమ్మ అయితే
తనవారిని తీర్చిదిద్ద కరిగే కొవ్వొత్తి నాన్న!

అక్షరాలు రెండైన
అక్షరాలలో నింప వీలుకాని అనురాగం అమ్మ !
అక్షయమైన అనుభూతుల అనుభవం నాన్న!!

నాన్నకు ప్రేమ తో..

Dec 31, 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

ఒక సెకను మార్పుకి
క్యాలెండర్లను మార్చుకుని, అభినందనలను మార్చుకుని,
ఆకాంక్షలను పెంచుకుని, ఆనందాన్ని పంచుకుని,
సంవత్సరానికి సరిపడా వెలుగుని ఒక్కరాత్రిలో నింపి 
ప్రపంచమంతా చేసుకునే అతిపెద్ద దీపావళి !
నూతన సంవత్సర సంరంభకేళి !!

జీవితం అనే రంగుల తెరపై మారనిది మార్పే అయినపుడు
మనం చేయాల్సింది మార్పు కి నేర్పుగా కూర్పు మాత్రమేనేమో !
క్షణక్షణానికి మలుపుల మంత్రాన్ని చదువుతున్న కాలకడలి తో ప్రయాణం అన్నపుడు ఒక్కో సంవత్సర అలని తాకి తన్మయించాలనుకోడం తప్పు కాదేమో !!

తన ప్రయాణానికి తపనకి జీవిత మథనానికి,
కాలానికి కళ్లెం వేసే , నిమిషాలకు అంకెలు వేసే, రోజులను తరాజులో తూచే
సంవత్సరం అనే సరికొత్త పదాన్ని సంబరాన్ని సృష్టించాడు మనిషి!
తనని తాను సరిచూసుకోడానికి సరి చేసుకోడానికి సందర్భంగా
అనంత సమయ సముద్రాన్ని సంవత్సరాలతో కొలుస్తున్నమహర్షి !!

పన్నెండు నెలలు నిత్యనేస్తమై బాధానందాల ఎండావానలను కురిపించి మరిపించి వెళ్తున్న పాత వత్సరమను అలసిన అలకు వీడ్కోలు చెపుతూ 
క్రొంగొత్త ఆశలు ఆకాంక్షలతో బుడి బుడి అడుగులతో వడిగా  వస్తున్న,
మానవత్వ మలయమారుతంసౌభ్రాతృత్వ సౌరభాలను మోసుకొస్తున్న
నూతన సంవత్సరానికి 
నిండు మనసుతో మెండు మంచితనంతో పండుగలా ఆహ్వానం పలుకుదాం !
వసుధైక కుటుంబంగా అందరం వేయిహాయిరాగాలతో ప్రశాంతతను పంచుదాం !!

నూతన సంవత్సర శుభాకాంక్షలు  !
మీరు మీ కుటుంబం ఆనంద సుమసుగంధాలతో విరాజిల్లాలని  ఆకాంక్షలు !!
--- దర్భశయనం ప్రమోద్ కుమార్ 

Dec 29, 2012

అన్న !!

అఖండ మండలావర్త అనంత రూప అవతార పురుషుడు కూడ ....
        ప్రేమను పంచాలని ఒకసారి ..పొందాలని ఒకసారి కరిగి ఒదిగిన బంధం ...!


రామలక్ష్మణులు ఐనా  .... రావణాదులు అయినా 
        అసలు రామాయణం మొత్తానికి ఇరుసులాంటి ఇంపైన ఇల మానిక బంధం ..!!


నిత్యం తనను అంటి కాచుకునే శంఖు చక్ర శేషులను జగన్నాటక వేదికపై కూడా
       వీడలేక రూపాంతరం చెంది సముచిత స్థానం పొందిన బంధం ..!!!

         సహోదర సంబంధం ..మహా పరిమళ మంచి గంధం.!!!!


నవమాసాలు గర్భస్త బందీఅయి ..సకల సంకట నిలయ బహి:ఆవరణకు  బయటపడి ..
      భయపడి అదిరే చిరుచేతులకు భరోసా ఇచ్చే ఆపన్న హస్తం..అన్న...!


ప్రపంచ సుఖాలను పరిచయం చేస్తూ .పడరాని కష్టాలను తన భుజం మీద దాచెస్తూ..
      నాన్న అనగానే జనించే  ధైర్యం లా ..అమ్మ పిలుపు లోని మాధుర్యంలా అండగా నిలిచే ఆనందం అన్న !!


ఇంటిపేరు మారి ఇంకో ఇల్లు చేరి.. ఇన్నేళ్ళ ప్రేమ దూరమైనా బెంగ తో ఇంత ముఖం చేసుకునే
    చిన్నారి చెల్లి కి ..సకల సకుటుంబ సపరివార సమన బహుమానం ...అన్న !!!

   బాల కృష్ణుని బంగారు పెదాలపై వెన్న..కాల తృష్ణ కు కరగని బంధాలన్నిటిలోనూ మిన్న !!!!


 అన్న !


Jul 29, 2012

విషధార





నేనని నాదని ఒక చిన్న ప్రపంచం లో 
సాలె గూటి లో చిక్కిన అల్పప్రాణి లా వలయాల నిలయం లో 
సమస్య అనే పదానికి సరితూగని  అనేకానేక   పరిస్తుతులను సమస్యలుగా సృష్టించుకుని 
వాటి పరిష్కారానికై నరాల వీణని తెగేలా మానసిక ఒత్తిడి రాగం లో వాయిస్తూ..
జంజాట జూదం లో నన్ను నేను పావుగా మార్చుకుని 
ఎటు వైపుగా నా    మసకబారిన అలుపునిండిన ప్రయాణం??



ఖండాలు దాటి సముద్రాల ను అవలీలగా లంఘించి..
మాతృ భూమి ని మన అన్న పదాలని వీడి..
సంస్కృతి అన్నది సంపద నుంచి వస్తుంది అని బలంగా నమ్మే సమాజం లో 
సంభందాలు సన్నని దారాలుగా తేలిపోయే సమూహం లో..మనం మమేకం అవడం.
అవగాహనకు రాని ..అసలు అవసరమే లేని వృధా విలాసం..
సమయ కోశాన్ని శ్రుతి రహిత రాగం లా గతి లేని గమనం లా కరిగించే మతిలేని ప్రక్రియ !!

ఎందుకు ఇక్కడ జీవించాలి?
మనమెందుకు అసలు ఇక్కడ మనుగడ సాగించాలి?

సంపాదనే సమాధానమైతే...నీవు పుట్టిన నేలను గట్టిగా నమ్ము..కుదరకపోతే ఇంకా గట్టిగా అడుగు.వంద దారులని వాత్సల్యం తో చూపిస్తుంది..
వేగమే ప్రధానమైతే ..నిన్ను అల్లుకున్న బంధాలని తడుము...వారు వెంట లేని నీ వడి ..తడి లేని గాలి లా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది 

అక్కడ చాలక ..అమోఘ చరిత సహిత ..భారత భూమి పై ..
పాశ్చాత్య పరాయి వాసనలతో మన గాలిని నింపుకుని....ప్రపంచమొక కుగ్రామమని ప్రచారం చేస్కుంటూ.
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం ....వెల్లూనుకున్న సంస్కృతి వృక్షానికి ..విషధారలు పోస్తున్నాం..

ఇది కేవలం నా ఘోష కావచు.,లేక ఆక్రోశము అనిపించవచు..

అసలు జీవిత పరమానందం ..
నువ్వు పుట్టిన గడ్డ మీద .నీ వాళ్ళతో కలిసి చేసిన పయనాలలో ఉంది..
వాళ్లతో నువ్వు పంచుకున్న జ్ఞ్యా పకాలలో కలిసి ఉంది..
అని నా ప్రగాడ విశ్వాసం !!


ఇది తప్పనిపిస్తే..అనేకానేక జనసంద్రం లో ..అనవసర అలసడి గా నా మానస అలజడి ని విస్మరించండి..
మీ మది నాలా కంపిస్తే..నిజమేనని అనిపిస్తే..వాడుతున్న చరిత కి ఒక ఆలోచనని సజలముగా సమర్పించండి..!!





Jun 23, 2012

సహోదరి !!

సృష్టి ని దేవుడు అమ్మతో పరిపూర్ణం చేసాకా..
అమ్మతనం లో ఉన్న అమృతానికి దాసోహమై..
ఇంకా ఇంకా ఏదో చేయాలనే తపన తరుముతుంటే..
అమ్మ ప్రేమను ..అర్థం చేసుకునే మనసు కి వయసు ని కలిపి ని తోబుట్టువు లో రంగారించాడెమో..!
 చెల్లి అయినా ..అక్క అయినా .అమ్మ ప్రేమను మరిపించడానికి ..కారణం ఇదేనేమో !!


మగ పురుగుల అహాన్ని అల్లరిని అవని లా భరించి..
అవసరానికి ఆప్తుడైన హితుడిలా వెన్నుతట్టి ..
నిండు కుండలా వెండి కొండలా..నా అడుగులతో ముందో వెనకో జత కట్టే..ఆ రెండు జడల చిన్ననాటి జ్ఞ్యాపకాలు..జీవితకాలపు తేనే ధారలు ..


ఉన్నన్ని నాళ్ళు తలలో నాలుక లా కదలాడి...ఉన్నట్టుండి వేరే ఇంటికి అంకితమై..
కళ్ళల్లో నీళ్ళతో పాటు మన ఏక గర్భ సహవాసం జల జలా కరిగిపోతుంటే...
కొత్త బంధాలతో..అనుబంద దారాలతో నిన్ను నువ్వు చుట్టుకుని..
ఈ చిన్న నాటి నుంచి నీ తోడుగా నీ తోకగా తిరిగిన ఈ సంభందాన్ని మరుస్తావేమో అని మనసంతా మబ్బుపట్టిన ఆకాశం లా ఏదో వెలితి..!


అదే ప్రశ్న అమ్మని అడిగితే ..
మరిచిపోఎందుకు..మీరు కలుసుకుంది రైల్లో కాదురా నా ఒళ్లో ..అన్నపుడు...ఒక్కసారిగా దినమధ్య భాస్కర తేజం తో మనసు అద్దం లా మీరుస్తుంది..కళ్ళు కాంతులీనుతాయి ..


ఎన్ని కొత్తవి కలిసినా అదే ప్రేమని ..అమ్మ మనసు ని తలపించే నిన్ను చూస్తుంటే..,
ఒక సోదరి లేని జీవితం ఏంటో నిశ్శబ్దం గా ..పసిరికలు లేని పంట పోలాల్లా ..కరువు భీతి..!
అవును..మమకార కరువు భీతి..!


అందుకే కాబోలు తర్వాతి జీవితానికి భరోసా ఇవ్వడానికే అన్నట్టు ..తోబుట్టువుని సంప్రదాయం తో ముడేసారు .!!



Jun 11, 2012

భారత మాతా.గుండె ని రాయి చేసుకో తల్లీ!!

అపుడెపుడో.. 
ఆనందంగా పల్లెటూరు ని కౌగిలించుకుని మాటాలాడినట్టు లీలగా ఒక జ్ఞ్యాపకం ..


మట్టి రోడ్డు మీద మొరటుగా పడ్డ చినుకు తడికి లేచిన నెల గుబాళింపుని మనసు నిండా నింపిన అనుభవం..
బడి గంటకి పరిగెత్తుతున్నపుడు  పైరగాలికి రేపరేపలడుతూ ...పొలాలు ఆలపించిన పచ్చని రాగాల పరిచయం..
మామిడి తోటల్లో పిక్నిక్ లని ప్రకృతిని దగ్గరగా చూపించే ప్రయత్నానికి సలాము చేయలేని  బాల్య అసహయతనం..

చెట్టు కింద తరగతులు..సాంస్కృతిక సమ్మేళనాలు..
పరిపూర్ణ వ్యక్తిత్వ మార్గాలు..సర్వతో ముఖ వృద్ది సూత్రాలు ..

బడి అంటే చదువుతో పాటు జీవితాన్ని ..
మార్కులతో పాటు మనుషులుగా ఎలా నిలబడాలో చూపే ,నేర్పే స్థలమని..
ఆటలు ..పాటలు..నాటకాలు..నాయకత్వ లక్షణాలు..
ఇవి ముందు జీవితానికి..సవాళ్ళ సవారికి చాల అవసరమని
 పసి మనసుల్లోనే పటిష్టమైన పునాదులు వేసిన పవిత్ర ప్రదేశమని..

అపుడు తెలీలేదు..ఇపుడు తెలిసి దుఖం ఆగటం లేదు..

ఎక్కడికి వెళ్తున్నాం మనం?
విలువల సమాహారమైన మన విద్యా విధానాన్ని వీడి..ఎక్కడికి వెళ్తున్నాం మనం??

చదువంటే బట్టీ పోటీలని.. ర్యాంకుల సంకుల సమరమని..
బడంటే నాలుగు గోడలు ..రెండు కంప్యూటర్లు..ఒక సులువైన సంపాదానా మార్గం గా మార్చుకుని ..
అంతర్జాతీయ ప్రమాణాలని ..అంతకంతకు కోల్పోతున్న మన విధానాలతో..
.ఎక్కడికి వెళ్తున్నాం మనం???

భారత భూమి అంటే సంస్కృతి..భారత చరిత అంటే ఉన్నతి..
ఏనాడో ప్రపంచానికి ఇదీ  చదువంటే అని విశ్వ విద్యాలయాల ద్వారా చాటిన మనం..
చదువు లక్ష్యాన్ని రేపటి సంపాదనకి ముడి పెట్టి నేర్పే తరగతులు మన భావి తరాల్ని తీసుకేల్లేది ఎక్కడికి?

పేపర్లో ఫోటో కోసం...క్షణాలలో సమాధానాల వెతుకులాటలో అలసిన ఆ బాల్యం రేపు వెనక్కి తిరిగి చూసుకునేలా ..
జీవితానికి సరిపడా తీపి గుర్తులను ఏమిస్తున్నాం మనం?

నేర్చుకునే వయసులో ర్యాంకుల సంపాదనకి .పరిగెత్తి ..
సంపాదించే వయసులో నేర్చుకునేందుకు పరిగెత్తి ..పరిగెత్తి..చేరుకునే గమ్యం ఏమిటి..?

మనిషి చేసే తప్పులకి కాలం వేసే వేసే శిక్ష ..ఆ జాతి చరిత్రనే తిరగారాసేదైతే..
దాన్ని తప్పు కన్నా పాపం అంటే సబబేమో?

భారత మాతా..కాలపు ప్రతీ వీచికపైన విజయం తో విలసిల్లిన నీకు..
రాబోయేవి అలలు కావు..సునామి విష కీలలు అని ..నీ సంస్కృతీ తిలకానికి తిలోదకాలిచ్చె తరాలనీ తెలిసి..
గుండె ని రాయి చేసుకో తల్లీ!!

Mar 22, 2012

మది నిండిన అభినందన శుభ ఉగాది !!



నందనవనమున వికసిత  మోహన మురళిగా..నందుని ఇంట ముకుంద సుగంధ రవళిగా
సుందర సుమధుర సుమతీ జలధిగా..అందరి ఎదలలో ఆశల సవ్వడిగా..
గత వర్షము నీడలోన తీపి జ్ఞాపకాలు పొదగ ..ఖర ఖడ్గము వాడి పైన తేలిన గాయాలు మాన్పగా
తేట తెలుగు ముంగిటన వెలసిన నవ కాంతి వై
కోటి ఊసుల మదిలో  రమ్యరాగ గీతివై
వస్తున్న నందనమా.. అందుకో అభివందనమా !


క్షణ క్షణమున  జనగణమున మంగళ మోదములిడగా
విరుతరులతో జలగనులతో నిండుగ మెండుగ విరియా
చీకటి కుంచిత మనసుల ధవళపు యోజన పుంజిగా
రేపటి వేదిక ఎక్కిన సోదర భావ పరిమళముగా
హరివిల్లును సుమజల్లును  తనతోటి తెస్తున్న నవ వత్సర వెడుకిది..పాతబడని కొత్త ఇది ..!


స్వేదవదన లవణధారే ధర న విజయ రహదారిగా..చేదు వేపతిన్న తెలుగు కోకిల తీయగా కూయగా
నేటి వెగటు భాధరుచే రేపటి చక్కెర గురుతుగా ..నరనరమున జివ్వుమనే పుల్లటి అనుభూతి లాగా
మమకారపు నుడికారము అణువణువూ అలరింపగా
అన్ని రుచుల అమరికే మన జీవనమని సమభావము సందర్భాముగా సమయము చెప్పే పండుగిదే
మంచన్నది పంచేందుకే  ..మన అన్నదే పెంచేందుకే ..మనసున్నది ..మనిషున్నది ...పండుగ పరమార్థమిదే..


తెనుగంటే తిక్కన్న తీపి మరికొంత  ..తెనుగంటే రుద్రమ్మ తెగింపు కొంత
తెనుగంటే తేనేధారల కుండపోత ..తెనుగు వెలుగులకు మొక్కే రాజులే ,మనమెంత?
తెనుగు తిరిగి వైభవమ్ముగ విరియా..ఆంద్రభోజుని పలుకు నిక్కముగా నిలబడగా.
కావాలి ఈ ఆశ జన శాసనముగా ...రావాలి స్వర్ణయుగమే వత్సరాది కానుకగా..


మీ ఇంట ఆనంద నందగీతి  చిందులాడ..గోవింద అరవింద ప్రసన్న కటాక్ష వీక్షలందా
మీ ఆశీసుల ఆదరములు నాపై  ఎల్లపుడు కురియ..
విచ్సేస్తున్న నందన నామ సంవత్సరమిది..అందరికి మది నిండిన అభినందన  శుభ ఉగాది !!