Jun 29, 2025

ముగ్గురమ్మల మాతృ వైభవం

సర్పము మీద విష శ్వాసలలో శయనించే నీలమేఘ శ్యాముడు ఒకడు,
సర్పాన్ని హారంగా ధరించి, విష జ్వాలలను గళములో నిలిపిన నీలకంఠుడు ఒకడు,
నుదుటన తిలకం బదులు బడబాగ్నులను దాచిన త్రినేత్రము కలిగిన విచిత్ర వదనుడు ఒకడు,
నాలుగు దిక్కులకు నాలుగు ముఖములతో నిత్యం తపస్సే చేసే పితామహుడు ఒకడు.

మంచు కొండల మీద వణికించే చలి గాలుల కైలాసపురమే కాపురము ఒకరికీ,
మహాపాల సముద్రపు అలలపై ఆది శేషుడే ఆవాసమైన సంసారం ఒకరిది.

త్రిమూర్తులని, లోకాల్ని చక్కదిద్దేవారు పతులని బిరుదులు ఇచ్చినా,
స్తుతులు పాడినా, శతకాలు రాసినా ..
ఒక సతి ఆశించే సాధారణ పతి లబ్ధితములేవి లేకపోయినా..
మీరు జన్మనిచ్చిన సంతానంతో “అమ్మ” అనిపించుకోకపోయినా…

మహా సహనవర్తులు, సహకార – పతిప్రేమానురక్తులు
మమ్మేలు మహామాతృమూర్తులు, ముగ్గురమ్మలు,

అయ్యలు గొప్పవారై ఉండవచ్చు, భక్తవత్సలులై ఉండవచ్చు –
కానీ మా ముగ్గురమ్మల సహనమే వారి ధనము,
మా తల్లుల తోడి సహవాసమే వారి యశము,
ప్రాభవము, వైభవము.

అమ్మలేనిదే పిల్లలు లేరు,
ఈ ముగ్గురమ్మలు లేనిదే ముల్లోకాలు లేవు.