Sep 5, 2009

నువ్వు.. నీ చిరునవ్వు ..

వెన్నెల వెళ్లిపోయినపుడు ,వేదన వీడని నీడ అయినపుడు..

వేకువలా , చీకటి లో చిరు దీపం లా నీ చిరునవ్వు!!

విజయం వెక్కిరించినపుడు,ప్రయత్నాలన్నీ ఎండమావులే ఐనపుడు..

ఎద లో ఆత్మ విశ్వాసం నిండేలా,ఎడారిలో చిరు జల్లులా మళ్ళీ నీ చిరునవ్వు!!

తెగుతున్న దారాల్లా ఆశ సన్నగిల్లినపుడు,ఉషస్సు లేని ఉదయం లా జీవితం మారుతుందనిపిస్తున్నపుడు..

మళ్ళీ ..నిస్తేజాన్ని కరిగిస్తూ,కొత్త శ్వాస ను నింపుతూ,భగవద్గీత లా నీ నవ్వు!!

ప్రపంచమంతా పనికిరానిదని, పంకిలమైనదని పరి పరి విధాల పరితపిస్తుంటే

పవిత్రంగా, పద్మ పత్రం మీద నీటి బిందువులా పల్లవిస్తూ నీ నవ్వు!!

ఎడతెరపని తుఫానుని ఆపుతూ స్వచ్చం గా ఉదయిస్తున్న బాల భానుని ప్రశాంతత తో

రణగొణ ధ్వనుల మద్య షెహనాయి, నాదస్వరం ల శ్రావ్యత తో

తటాక మధ్యమున తలెత్తి నిలుచున్న తామర సౌందర్యం తో

బీడు బారిన భూమి భాదంతా తీరేలా తాకిన తొలకరి ఆప్యాయత తో ...నన్ను మార్చే నీ నవ్వు!!

నేనేంటో నాకే తెలీనపుడు.. నువ్వే నేననిపించేల ..నా ప్రస్థానాన్ని నా గమ్యాన్ని నాకు చూపించి
నడిపించే నా అంతరాత్మలా ..
నాకే తెలీని నా శక్తిని సరికొత్తగా పరిచయం చేసే చల్లని నీ నవ్వు..నువ్వు!!


కాళ్ళ కింద నేల కదిలిపోతున్నా..నిన్న ,రేపు నన్ను వదిలిపోతున్నా...నువ్వు నీ చిరునవ్వు ఇవి చాలు నా ఈ నేటికి ...

చెప్పాలంటే కరిగిపోకుంటే... ఈ క్షణానికి!!