Dec 31, 2007

నిశ్శబ్ద నిశి రాత్రి నుంచి,

నింగినేలే నెగడు రేడు కి స్వాగత ప్రవచనం పలుకుతూ..
అమ్మ ఒడిని తిరిగి చేరుతున్న అలసిన గత వత్సరానికి వీడ్కోలు చెప్తూ..

బుడి బుడి అడుగులతో వడిగా కదన రంగం లోకి కాలిడింది నవ వత్సరం. ఆశల మలయ సమీరం !!

బాల భాస్కరాగమానానికి,

సాగర కెరటాల అలజడికి లేని సంవత్సరాల సందడి ,

మనిషికే ఎందుకూ అంటే ఆశ అన్న పదమే సమాధానమౌతుంది !!

గతాన్ని పునాదిగా ,భవిష్యత్ భవనానికి, నేడు రూపకల్పన చేయటానికి,
తనను తాను సరికొత్తగా సమీకరించుకోవడానికి ,సమరానికి సంసిద్దమవటానికి,
నరుని ప్రతి సృష్టి --నవ వత్సరమన్న సంరంభ కేళి!

హర్షాతిరేకాలను కలిగిస్తుందనేమో..

వర్షం అన్న పదానికి మరో అర్థం అయింది సంవత్సరం...!

తాజా తేదిలతో ఐనా జీవిత వీణపై సరికొత్త రాగాలు పలకాలని ఆకాంక్షల సమాహారం !!

కాలంతో నే కలిసి ప్రయాణం అయినపుడు

సమయ సంద్రం లొ ని ఒక్కో అలను తాకి తన్మయించాలనుకొవడం తప్పు కాదెమో!!

Dec 13, 2007

మారనిది మార్పు ఒక్కటే

వెన్నెలలు చిమ్మే జాబిలి
వేకువ తొ మాయమౌతుంది

వన్నెలు నిండిన అందమూ

వయస్సు తో ప్రయాణిస్తుంది

చుట్టూ చీకటిలా అనిపిస్తుంటే

కళ్ళు తెరవాలని అర్థం !

కరగని పర్వతంలా అవరోధం ఉంటె
అదే మార్గం మార్చాల్సిన సంధర్భం !!

ఏదీ శాశ్వతం కాదు ..అలాగని వైరాగ్యమూ వద్దు!

జీవితం అనే రంగుల తెరపై ఎపుడూ మారనది మార్పు ఒక్కటే..

నువ్వు చేయాల్సిందల్లా ఆ మార్పు కు నేర్పుగా కూర్పు మాత్రమే!


ఎపుడూ ఒకే దిశలో ప్రయాణం చేసేవాడు గమ్యం చేరలేడు !

పరిస్థితి ప్రకారం ప్రణాలిక మార్చేవానికి పరాజయం పరిచయం ఉండదు !!

May 23, 2007

కాలం కొవ్వొత్తిలా కరుగుతూ.....

జ్ఞాపకాల వెలుగు పూలను విరబూయిస్తూనే ఉంటుంది!

వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన బడిప్రయాణపు పిల్లగాలి చల్లగా పలకరిస్తుoది!!
బాల్యం బాగున్నావా అని ఆప్యాయంగా అడుగుతుంది!!!

బడి గంటకు భయపడి పరిగె త్తింది జ్ఞాపకమే!

బడిని వీడిన చివరిరోజు రాలిన కన్నీరు జ్ఞాపకమే!!

మామిడి పండుకై హెడ్ మాస్టర్ తిట్టినప్పుడు,

మార్కుల కోసం, ర్యాoకుల కోసం తపన పడినప్పుడు,

ఆ బాధ జ్ఞాపకం!

ఆ ఆనందమూ జ్ఞాపకం!


అల్లరి నిండిన ఆ చల్లని రోజులు స్తబ్ధత కొలువైన నేడుని వెక్కిరిస్తున్నట్టు,

ఆశతోనిండిన ఆ చిన్నారి కళ్ళు యాంత్రికమైపొయిన నన్ను చూసి ప్రశ్నిస్తున్నట్టు,

అపుడు తెలియని ఆ ఆనందం ఇపుడు గుర్తుకొచ్చి గుండె బరువెక్కినట్టు,

ఏదోబాధ , ఏదోఆనందం !!!

నా జ్ఞాపకాలలో కొలువున్న మీకు
కృతజ్ఞతా కుసుమాలను సమర్పించి ఉడుతాభక్తిని చాటుకోవాలని నా ఈ చిన్నప్రయత్నం !!!